Wednesday, April 14, 2021

వాల్మీకి రామాయణం నేర్పే పాటలు

 వాల్మీకి

 

వాల్మీకి మహర్షిని గూర్చి కొన్ని విషయాలు తెలిసికొందాం.

ఈయన ప్రచేతసుడు.  గొప్ప మహర్షి.  తెలియని  వారు బోయ వాడని అనుకుంటారు.  ఆయన వద్దకు బ్రహ్మయే స్వయంగా వచ్చి ఆయనను శ్రీమద్రామాయణము కావ్యముగ వ్రాయమని చెప్పినాడు.  నారద మహర్షి స్వయముగ వచ్చి ఆయనకు శ్రీమద్రామాయణ కథను సంగ్రహంగా చెప్పినాడు.  

బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల వాల్మీకి మహర్షికి శ్రీమద్రామాయణ మంతయు కండ్లకు కట్టినట్టు స్ఫురించుటయే గాక ఆయనకు ఆ యా పాత్రల మనఃస్తత్త్వాలు ఆ యా సమయాలలో ఏవిధంగా ఉండినవో కూడ ఆయనకు తెలిసి వచ్చేది.  ఆ కారణంగా ఆయన వ్రాసినవి యథాతథంగా జరిగినవే.  కల్పితములైన పాత్రలు కావు.  కావ్యములలో కల్పితమైన పాత్రలు ఉండవచ్చు.  వాల్మీకి మహర్షి వ్రాసిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో ప్రతి పాత్ర ఆనాడు సజీవమైనదే.  ఆ కాలమునాటి పవిత్రత, ధర్మబద్ధత, ప్రేమ, సత్యవాక్పరిపాలన, పితృవాక్య పరిపాలన, గురు భక్తి, పితృభక్తి, దయ, ధర్మము,  పాతివ్రత్యము, పాతివ్రత్య మహాత్మ్యము, పౌరుషము, రాజధర్మములు, భ్రాతృ ప్రేమ, ఈర్ష్యా ద్వేషముల ప్రభావము, మానవుల దృఢవిశ్వాసములు, మంత్రానుష్ఠానమహాత్మ్యములు, దైవానుగ్రహము, దైవీసంపత్తి, రాక్షసప్రవృత్తి, పట్టుదల, కార్యసాధనా సామర్థ్యములు, కృతజ్ఞతా భావములు, శమ దమాది నియమ పాలన, ధర్మముమీది విశ్వాసము వలన కలుగు ధైర్యము, వంటి ఎన్నో మానవునకు ఎల్లప్పుడు తన ప్రగతికి వ్యక్తిగతంగాను, సాంఘికంగానూ నాటి పాత్రల ప్రవృత్తుల ద్వారా నేటికి భవిష్యత్తరాలకు పనికి వచ్చురీతిలో వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణ కావ్యము భూమి మీద పర్వతములు, నదులు,చెట్లు, సూర్య చంద్రాదులు ఉండు నంత వఱకు ఉండునని బ్రహ్మ చెప్పినది అతిశయోక్తి కాదు. నేటి ప్రజలకు నాటి రామాయణం నేర్పిన పాఠాలు చక్కగ ఉపయోగ పడును.  నేటి విద్యాభ్యాస విధానంలో వాటిని చేర్చనందున ధర్మలోపము జరుగు చున్నది.  దానిని సరిదిద్దుటకు మరల ప్రతి ఒక్కరు శ్రీమద్రామాయణమును అధ్యయనము చేయుటకు దోహదపడుటకు ఈ ప్రయత్నము చేయడమైనది.  


డా. యన్ వి కోటేశ్వరరావు.

9866662732.

14.4.2021.